ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి భవనంపై నుంచి పడి మృతి చెందిన సంఘటన గోపాలపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ పరిధి కొత్తపాలెం గ్రామానికి చెందిన దాడి సంతోష్ (25)కు కాలేయ వ్యాధితో పాటు టీబీ సోకడంతో చికిత్స నిమిత్తం గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి రెండో అంతస్థులోని ఒక గదిలో చికిత్స పొందుతున్న సంతోష్‌కు తోడుగా అతని తల్లి పైడిరాజు శనివారం రాత్రి నిద్రించింది.
అయితే ఆదివారం తెల్లవారుజామున సంతోష్‌కు మందులు ఇవ్వడం కోసం ఆ గదికి నర్సు వెళ్లి తలుపు కొట్టడంతో డోరు తెరిచింది. అయితే గదిలో సంతోష్ కనిపించకపోవడంతో ఆయన కోసం వెతగ్గా ఆస్పత్రి వరండాల్లో కిందపడి ఉన్నాడు. సంతోష్ తలకు తీవ్ర గాయాలవ్వడంతో మృతి చెందినట్టు గుర్తించారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అయితే సంతోష్ అనారోగ్యం కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారిపడి మృతి చెందాడా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.