ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా ఇరవై ఓవర్లలో 237 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 22 బంతుల్లో ఐదు సిక్సర్లు, 5 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో సూర్యకుమార్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. టీం ఇండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ 31 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించారు. వారి వెనుక సూర్యకుమార్ నిలబడ్డాడు. అంతేకాదు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు చేసిన క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 573 బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉండేది. మ్యాక్స్‌వెల్ 604 బంతుల్లో వెయ్యి పరుగులు చేశాడు. ఆదివారం నాటి మ్యాచ్‌తో మాక్స్‌వెల్ రికార్డును సూర్యకుమార్ యాదవ్ బద్దలు కొట్టాడు.