రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సొంతగడ్డపై సత్తా ఏంటో చూపిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో విజయం సాధించింది. సఫారీల ముందు భారత్ 238 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే అసాధ్యమైన లక్ష్యాన్ని సాధించేందుకు దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడింది. చివరికి భారత్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి స్వదేశంలో దక్షిణాఫ్రికాపై తొలిసారి 2-0తో ద్వైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 మంగళవారం ఇండోర్‌లో జరగనుంది. సౌతాఫ్రికాపై స్వదేశంలో రెండు జట్లు టీ20 సిరీస్‌ను గెలవడం ఇదే తొలిసారి. 2015లో టీ20 సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. 2019లో సిరీస్ డ్రా కాగా, జూన్ 2022లో కూడా సిరీస్ డ్రా అయింది. ఈ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. తన సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. ఈ క్రమంలో ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. 2016లో ధోనీ నాయకత్వంలో భారత్ 15 టీ20ల్లో విజయం సాధించగా.. రోహిత్ శర్మ 16 మ్యాచ్‌ల్లో భారత్‌ను విజేతగా నిలిపాడు. దక్షిణాఫ్రికాపై తొలి టీ20 విజయంతో రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు.