థాయ్ లాండ్ లో ఘోరం జరిగిపోయింది. అక్కడ ఓ మాజీ పోలీసు అధికారి తుపాకీతో విలయం సృష్టించాడు. ఈశాన్య థాయ్ లాండ్ లోని ఓ బేబీ డే కేర్ సెంటర్ లో కాల్పులతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో 34 మంది మరణించారు. అందులో 22 మంది చిన్నారులే. ఇదిలావుంటే ఈ కాల్పుల ఘటన అనంతరం మాజీ పోలీసు అధికారి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో థాయ్ లాండ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇతర తూర్పు ఆగ్నేయాసియా దేశాలతో పోల్చితే థాయ్ లాండ్ లో వ్యక్తులు తుపాకులు కలిగి ఉండడం ఎక్కువ. అధికారిక గణాంకాల కంటే అక్రమ ఆయుధాల సంఖ్య ఎక్కువే ఉంటుంది. అయితే అమెరికా తరహాలో థాయ్ లాండ్ లో విచ్చలవిడి కాల్పుల ఘటనలు చాలా అరుదు. 2020లో ఓ సైనికుడు ఓ ఆస్తి వివాదంలో ఆగ్రహం చెంది 29 మందిని కాల్చి చంపడం ఈ పర్యాటక దేశంలో సంచలనం సృష్టించింది.