పేదలకు అత్యున్నత వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఆవరణలో మాత శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం (ఎంసిహెచ్) నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు వైద్య కళాశాలలో చదివి నార్త్ అమెరికాలో స్థిరపడిన వారు కలిసి ఏర్పాటు చేసిన జింకాన ట్రస్ట్ రూ. 86 కోట్ల విరాళాలతో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులు త్వరగా పూర్తయ్యేలా జింకాన సభ్యులే చూస్తారని చెప్పారు. దీనికి గత ప్రభుత్వం రెండు సార్లు శంకుస్థాపన చేసి వదిలేశారని అన్నారు.
జింఖాన ప్రెసిడెంట్ ఆళ్ల శ్రీనివాసరెడ్డితో తాను మాట్లాడి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. జింఖాన ట్రస్ట్ సభ్యులు డాక్టర్ ఉమాదేవి గవిని రూ. 22 కోట్లు, డాక్టర్ మువ్వా వెంకటేశ్వర్లు రూ. 22 కోట్లు, డాక్టర్ కష్ణ ప్రసాద్ రూ. 11 కోట్లు, డాక్టర్ నళిని రూ. 11 కోట్లు, డాక్టర్ హరిత రూ. 50 లక్షలు, తదితరులు కలిసి మొత్తం రూ. 86 కోట్ల విరాళం ప్రకటించి సెల్లార్, ఆరు ఫోర్లతో 600 పడకలతో ఎంసిహెచ్ నిర్మిస్తున్నారని, ఇది పూర్తయితే తల్లీబిడ్డల సేవలు ఒకేభవనంలో రానున్నాయని తెలిపారు. వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు ద్వారా రూ. 16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో 1059 వైద్యచికిత్సలు అందిస్తే, ప్రస్తుతం 2442 వైద్య చికిత్సలు అందిస్తున్నారని, ఈ నెల 15 వ తేదీ నుండి మరో 808 వైద్య చికిత్సలు చేరుస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ 1250 బెడ్ల సామర్ధ్యం గల జిజిహెచ్‌లో కరోనా రెండవ దశలో కొన్ని వేల మంది చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకున్నారన్నారు. జిజిహెచ్ ఒక అద్భుతమైన ఆసుపత్రి అని కొనియాడారు. 2007లో ఎమ్మెల్సీగా తాను ఎన్నికయ్యాక జిజిహెచ్‌లో మాతా శిశు సంరక్షణ వార్డు ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖరరెడ్డికి విన్నవించగా అంగీకరించారని, కాని కార్యరూపం దాల్చలేదని, ఇప్పుడు జింఖాన ప్రతినిధులతో సాకారం అవుతుందని అభినందనలు తెలిపారు.
జింఖాన సభ్యులు డాక్టర్ వెనిగండ్ల బాలభాస్కరరావు, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ కళాధర్‌ను సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ఎల్. అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మహ్మద్ ముస్తాఫా, మద్దాలి గిరిధర్, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. ప్రభావతి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం. శేషగిరిరావు, మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వి. లక్ష్మణరెడ్డి, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు వినోద్‌కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ సుమయాఖాన్, జింఖాన సభ్యులు డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ బాబురెడ్డి సాగిరెడ్డి, డిప్యూటీ మేయర్లు బాలవజ్రబాబు, సజీలా పాల్గొన్నారు.