విశాఖపట్నం: ఎన్ఏడీ వంతెన దాటు తుండగా, ట్రాలర్ ఢీకొని డాకియార్డు ఉద్యోగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడివివరం ప్రాంతంలో నివాసం ఉంటున్న కె. అప్పుల సత్యనారాయణ(53) డాకియార్డులో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి రోజులాగే గురువారం ఉదయం ఇంటినుంచి తన ద్విచక్ర వాహనంపై డ్యూటీకి బయలుదేరాడు. ఎన్ఏడీ వంతెన పైనుంచి మలుపు తిరుగుతుండగా, ఎయిర్పోర్టు నుంచి వస్తున్న భారీ ట్రాలర్ ఒక్కసారిగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో వెంటనే సత్యనారాయణ వాహనంపై నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.