టీచర్ ఉద్యోగం అంటే అభిమానంతో లక్షల జీతాన్ని వదులుకుని విదేశాల్లో ఉంటున్న కొందరు ఇటీవల ఏపీకి తిరిగి వస్తున్నారు. ఇదిలావుంటే డీఎస్సీ-98లో అర్హత సాధించిన అభ్యర్థులకు కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిపైఉన్న మమకారంతో క్వాలిఫై అయిన ఎంతోమంది ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో సుదీర్ఘకాలం ఎదురు చూశారు. న్యాయ, సాంకేతిక కారణాలు, సమస్యలతో చివరకు ఉద్యోగాలు రాకపోవడంతో వీరంతా వేర్వేరు వృత్తు ల్లో స్థిరపడిపోయారు. అర్హులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోర్టు చెప్పడంతో పాటు తాము అధికారంలోకి వస్తే 98 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని తన పాదయాత్రలో సీఎం జగన్మహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు వీరికి ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
నియామక ప్రక్రియ ప్రారంభం కావడంతో విదేశాల్లో ఉన్నవారు సైతం ఉపాధ్యాయ ఉద్యోగం చేరడానికి స్వదేశానికి రావడం గమనార్హం. ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో అక్కడ లక్షల్లో జీతం వదులుకుని వచ్చేస్తున్నారు. దుబాయ్‌లో ఉండే నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరికండ్రిగకు (ప్రస్తుతం తిరుపతి జిల్లా) చెందిన మునుస్వామి కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వచ్చారు. మునుస్వామి 15 ఏళ్లుగా అక్కడ ఓ కంపెనీలో పని చేస్తూ నెలకు రూ.2.5 లక్షల జీతంతో స్థిరపడ్డారు.
అయితే, 1998 డీఎస్సీ అర్హుల జాబితాలో తన పేరు ఉండటం, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలన్న తన జీవితాశయం మేరకు.. రూ.లక్షల జీతాన్ని వదులుకుని ఇటీవల స్వదేశానికి చేరుకున్నారు. సర్టిఫికెట్లు పరిశీలిస్తున్న అధికారులు ఆయన వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టమని, దీనికోసంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని మునుస్వామి తెలిపినట్లు అధికారులు చెప్పారు.