నిజంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెబితే తాను క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతల లిస్ట్ ను పంపుతానని, చర్యలు తీసుకుంటారా? అంటూ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంను ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల నెట్టెం రఘురాం పార్టీ నేతలను హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తనతో చెప్పుకోవాలని, అంతేకాని వక్రీకరించి మీడియాలో ప్రకటనలు చేయడం సరికాదని సూచించారు. పార్టీ ప్రయోజనాల కోసం ఇలాంటి విషయాలను సీరియస్ గా తీసుకుంటామని, క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అంతర్గత విషయాలపై మీడియాలో ప్రకటనలు చేయవద్దని సూచించారు.
నెట్టెం రఘురాం వ్యాఖ్యలపై కేశినేని నాని సెటైర్లు వేశారు. నిజంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెబితే తాను క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతల లిస్ట్ ను పంపుతానని, చర్యలు తీసుకుంటారా? అంటూ ప్రశ్నించారు. ఇలా సొంత పార్టీ నేతపై కేశినేని నాని విమర్శలు చేయడం టీడీపీలో కలకలం రేపుతోంది. గతంలో కూడా పలుమార్లు సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలపై కేశినేని నాని విరుచుకుపడ్డారు. ఇప్పుడు మరోసారి కేశినేని నాని మళ్ల అలాంటి తీరును ప్రదర్శించడం తెలుగు తమ్ముళ్లలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలావుంటే ఇటీవల తిరువూరుకు చెందని కొంతమంది పార్టీ నేతలను నెట్టెం రఘురావును కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ లను మార్చాలని నేతలు నెట్టెం రఘురాంను కోరినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో రఘురాం సీరియస్ అయ్యారు. కొంతమంది పార్టీ నేతలు తమ వద్ద ప్రస్తావనకు రాని విషయాల గురించి మీడియాలో ప్రకటన చేశారని, ఇలాంటి ఖండిస్తున్నట్లు తెలిపారు. పార్టీలో జరిగే అంతర్గత చర్చల గురించి మీడియాలో ప్రకటనలు చేయవద్దని సూచించారు.