తమ అభిమాన హీరోలపై అభిమానులు చాటే ప్రేమకు అవధులు ఉండవు. ఇటీవల కన్నుమూసిన సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత కృష్ణంరాజు విగ్రహాన్ని ఫైబర్‌తో ఓ శిల్పి రూపొందించారు. దాదాపు 30 రోజుల పాటు శ్రమించి రెబల్ స్టార్ విగ్రహాన్ని తయారుచేశాడు పిఠాపురానికి చెందిన శిల్పి. ఈ విగ్రహాన్ని శనివారం ఒంగోలులో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. సృష్టి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ భవన్‌లో జాతీయ చిత్ర కళా ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ప్రదర్శించిన కృష్ణంరాజు విగ్రహంప్రత్యేక ఆకర్షణగా నిలించింది. సాక్షాత్తు కృష్ణంరాజే వేదికపై నిల్చున్న అనుభూతి చూపరులకు కలిగింది. దీంతో పలువురు విగ్రహం పక్కన నిలబడి ఫొటోలు తీసుకుని సంబరపడ్డారు.
కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన కృష్ణ అనే శిల్పి.. ప్రభాస్‌పై ఉన్న అభిమానంతో కృష్ణంరాజు విగ్రహాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఇందుకుగాను దాదాపు 30 రోజులపాటు శ్రమించినట్టు వివరించారు. విగ్రహాన్ని త్వరలోనే ప్రభాస్‌కు కానుకగా అందజేస్తానని తెలిపారు. అయితే, అంతకు ముందు క్రికెటర్ ఎంఎస్ ధోనీతో పాటు పలువురు రాజకీయ నాయకులకు చెందిన 15 వరకు విగ్రహాలను రూపొందించినట్టు కృష్ణ పేర్కొన్నారు.
ఇదిలావుంటే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల కేంద్రంలోని స్థానిక శిల్పి వడయార్ కూడా కృష్ణంరాజు విగ్రహాన్ని తయారు చేశారు. రెబల్ స్టార్ కుటుంబసభ్యులు ఇచ్చిన సూచనల మేరకు వడయార్ ఆరు రోజులు శ్రమించి ఫైబర్‌తో జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని రూపొందించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 11 తుదిశ్వాస విడిచారు.