విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సోమవారం దళితవాడలో పర్యటించారు. విశాఖపట్నం ఓల్డ్ సిటీ పరిధిలోని రెల్లి వీధికి వెళ్ళారు. దళిత వాడగా గుర్తింపుపడ్డ రెల్లి వీధిలో తిరుగుతూ ధర్మ ప్రచారం చేసారు. స్థానికులు ఆరాధించే మరిడిమాంబ, గిల్లోరియమ్మ ఆలయాల్లో పూజలు చేసి హారతులిచ్చారు. దళిత వాడలో తిరగడం ఆనందం కలిగించిందని అన్నారు. ఎపుడు పిలిచినా ఈ ప్రాంతానికి వస్తానని తెలిపారు. దళితులతో జగన్మాత శ్లోకాలను చదివించారు. పరాశక్తి వైభవాన్ని వివరిస్తూ అమ్మవారి అండదండలు ఈ ప్రాంతంపై ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అన్య మతాల జోలికి వెళ్ళొద్దని, కన్న తల్లి లాంటి హిందూ మతాన్ని వీడొద్దని హితవు చెప్పారు. దైనందిన జీవితంలో దైవారాధనకు కొద్దిపాటి సమయాన్నయినా కేటాయించాలని సూచించారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఏర్పాటు చేసిన స్వధర్మ వాహిని సంస్థ తరపున స్వరూపానందేంద్ర స్వామి ఈ పర్యటన చేపట్టారు.