రుషింగి వంతెనకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 13 ఏళ్ళయినా ఈ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఈ మండల ప్రజలు ఎటువైపు వెళ్లాలన్నా నదిని దాటి వెళ్ళవలసిన పరిస్థితి ఇక్కడ ఉంది. దీంతో నదినే దాటాలంటే పడవలే ఆధారంగా ఉన్నాయి. వరదొస్తే రాకపోకలు బంధు అయి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. వంతెనలు లేక కొన్నిసార్లు ప్రమాదాలు సంభవించి మరణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న అపవాదు లేకపోలేదు. వంగర మండలం పరిధిలో గల మూడు నదుల పరివాహక ప్రాంతాల్లోనే కొన్ని గ్రామాల్లో ఉండటం, ఆయా గ్రామాల వారు గ్రామం దాటాలన్న ఎటు వెళ్లాలన్నా నాగావళి, వేగవతి, సువర్ణముఖి నదిలో ఏదో ఒక నది దాటితే తప్ప గమ్యానికి చేరుకోలేని పరిస్థితి నిత్యం ఎదురవుతుంది. నాగావళి నది ఒడ్డున వి వి ఆర్ పేట, జెకె గుమ్మడ, రాజుల గుమ్మడ, చిన్న రాజుల గుమ్మడ, రుషింగి, తలగాం తదితర గ్రామాల ప్రజలు వర్షాలు వచ్చాయంటే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్న రుషింగి వంతెన నిర్మాణం మాత్రం పూర్తి చేయడం లేదు. ఇప్పటికైనా రుషింగి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.