గురువు స్థానంలో ఉండి బాలికలపై వికృత చేష్టలకు పాల్పడుతున్న కీచక ఉపాధ్యాయులను సర్వీసు నుంచి తొలగించినా తప్పేమీ లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం ఏడోమైలు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్ధినిని లైగింకంగా వేధించి గర్భవతిని చేసిన వార్డెన్ వ్యవహారంపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళగిరిలోని కార్యాలయం నుండి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విద్యార్ధినిని వేధించి గర్భవతిని చేసి గతంలో ఒకసారి సస్పెండ్ అయినప్పటికీ బుద్ధి మార్చుకోకుండా అదే కీచకత్వానికి పాల్పడిన వార్డెన్ శ్రీనివాసరావు పై కఠిన చర్యలతో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈమేరకు గిరిజన సంక్షేశాఖ కార్యదర్శి, పల్నాడు ఎస్పీలకు మహిళా కమిషన్ నుంచి లేఖలు పంపినట్లు తెలిపారు. సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తుందనన్నారు.
విద్యార్ధినులపై చెడుబుద్ధి గల పైశాచిక గురువులకు హెచ్చరికగా చర్యలుండాలని వాసిరెడ్డి పద్మ లేఖలో సూచించారు. లైంగికదాడి, కిడ్నాప్, పోక్సోచట్టం కింద క్రిమినల్ సెక్షన్లతో కఠిన శిక్షలు విధించేలా సమగ్ర విచారణ జరపాలని వాసిరెడ్డి పద్మ పల్నాడు ఎస్పీకి సూచించారు.