రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుండి చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను బుధవారం గుంతకల్లు రైల్వే స్టేషన్లోని 7 వ ఫ్లాట్ ఫారం ఉత్తర చివరి భాగంలో అరెస్టు చేసి అతని వద్ద ఉన్న రూ. 3, 16, 646 విలువైన 73. 95 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిఆర్పీ సిఐ బివి. నగేష్ బాబు గురువారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మొగులూరు గ్రామం ఎన్టీఆర్ వీధికి చెందిన గుత్తా శరత్ చంద్ర అను వ్యక్తి రైళ్లలో ప్రయాణి కుల నుండి బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డాడన్నారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్ఆర్పి అజిత వెజెండ్ల ఆదేశాలు మేరకు జిఆర్పీ ఎస్సై మహేంద్ర, ఆర్పీఎఫ్ ఎస్సై రామకృష్ణా రెడ్డితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి నిఘా వేసి ఉంచామన్నారు. దీంతో టీమ్ అధికారులు, సిబ్బంది బుధవారం స్థానిక రైల్వే స్టేషన్లో 7వ ఫ్లాట్ ఫారంలో నిందితున్ని గుర్తించి అరెస్టు చేసి అతని వద్ద నుండి 73. 95 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచినట్లు జిఆర్పీ సిఐ బివి. నగేష్ బాబు తెలిపారు.