తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు, బాలకృష్ణ ఈ షోను ఎంచుకున్నారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడన్నది ఒట్టి అబద్ధమని స్పష్టం చేశారు. నాడు పార్టీలో గొడవలు చేయించింది, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టింది, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రోడ్ల పైకి పిలిచింది చంద్రబాబేనని స్పష్టం చేశారు.
నందమూరి బాలకృష్ణ తొలిసారిగా బుల్లితెరపై కనువిందు చేసిన కార్యక్రమం అన్ స్టాపబుల్. ఆహా ఓటీటీలో ప్రసారమైన తొలి సీజన్ విజయవంతం కావడంతో, తాజాగా అన్ స్టాపబుల్-2 షురూ అయింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై చిత్రీకరించిన ఎపిసోడ్ పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. లక్ష్మీపార్వతి దీనిపై పై విధంగా స్పందించారు.
అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ చూశాక బాలకృష్ణ అంటేనే రోత పుడుతోందని, అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అసహ్యం కలుగుతోందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉందని విమర్శించారు.