ఏపీకి తుఫాన్ ముప్పు ముంచుకొస్తుంది. ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం తుఫాన్ గా మారనుంది. తుఫాన్ ఏర్పడితే దానిని సిత్రాంగ్ గా పిలవాలని నామకరణం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో అనంతపురం జిల్లా అతలాకుతలం అయింది. తాజాగా ఏపీకి వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ముంచుకొస్తోంది. భారీ వర్షాలు వరదలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ వైపు పయనం కానుంది. ఆ తర్వాత తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ ఏర్పడితే సిత్రాంగ్ గా నామకరణం చేయనున్నారు. సూపర్ సైక్లోన్ ఏర్పడే అవకాశం ఉందని గ్లోబల్ ఫో ర్ కాస్ట్ సిస్టమ్ గుర్తించింది.సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీ, ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలపైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.తెలంగాణపైనా తుఫాన్ ప్రభావం కనిపించనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండి అలుగులు పారుతున్నాయి. దీనికి సూపర్ సైక్లోన్ తోడయితే జలవిలయం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం ఉదయానికి ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.