జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బీజేపీ నేతలు పరామర్శించారు. పోలీసుల ఆంక్షల కారణంగా హోటల్ గదికే పరిమితమైన జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ను బీజేపీ నేతలు కలిశారు. విశాఖ నోవోటెల్ హోటల్ కు వచ్చిన బీజేపీ నేతలు పవన్ తో సమావేశమయ్యారు. జనసేన నేతల అరెస్టులు, పోలీసుల ఆంక్షలను బీజేపీ నేతలు ఖండించారు. అంతకుముందు, బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్ తదితరులు పవన్ కల్యాణ్ కు మద్దతుగా ట్విట్టర్ లో స్పందించారు. విశాఖపట్నంలో దొంగలు పడ్డారంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ విమర్శించారు. 'గబ్బర్ సింగ్' దెబ్బకి గుండెల్లో గుబులు పుట్టినట్టుంది. పవన్ కల్యాణ్ ను ఆపడానికి వీళ్లెవరు? వైజాగ్ వీళ్ల జాగీరా? అంటూ ప్రశ్నించారు.
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ, 2017లో ప్రత్యేక హోదా కార్యక్రమంలో పాల్గొనకుండా జగన్ ను అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖపట్నం ఎయిర్ పోర్టులోనే ఆపేసిందని వెల్లడించారు. అది అప్రజాస్వామిక చర్య అయితే, ఇవాళ పవన్ కల్యాణ్ ను అడ్డుకోవడం ప్రజాస్వామిక చర్య అవుతుందా? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. మీ చర్యలు జనసేన-బీజేపీ విజయానికి నాంది అని జీవీఎల్ పేర్కొన్నారు.
ఇక ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. పవన్ పై ఆంక్షలు విధించడం ద్వారా ఎన్నికల్లో ఓట్లు పొందవచ్చని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. కానీ వాళ్లు పవన్ పై ఆంక్షలు విధించడం ద్వారా పెద్ద తప్పు చేశారని వెల్లడించారు. ప్రజల మద్దతు, దీవెనలు పుష్కలంగా ఉన్న పవన్ కల్యాణ్ ను ఇలాంటి ఆంక్షలతో ఏంచేయగలరని ప్రశ్నించారు.