కమ్మ సామాజికవర్గంపై రాజకీయ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం సహించేదిలేదని అఖిల భారత కమ్మ సామాజికవర్గం హెచ్చరిక చేసింది. కాకినాడలో ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు, ఒడిసా, తెలంగాణ, కర్ణాటక, ఖమ్మం సంఘాల అధ్యక్షులు పర్వతనేని పట్టాభిరామ్, బొడ్డు రవికుమార్, వల్లూరి వెంకట్రావు, తాళ్లూరు జీవన్‌కుమార్ మాట్లాడారు. తమ సంఘానికి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టంచేశారు. కమ్మ సామాజిక వర్గమంటే కుల సంఘం కాదని.. ఏపీ, తెలంగాణలో ఉన్న కోటి మంది, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మరో కోటిమందిని ఒకే వేదికపై తీసుకొచ్చి అఖిల భారత కమ్మ మహాజన సంఘాన్ని ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో విస్తృత సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడిం చారు. అమరావతి రాజధానికే తమ మద్దతు అని... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తిరిగి పెట్టాలని కోరారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సామాజికవర్గాన్ని ఎత్తిచూపితే ఎంతమాత్రం సహించేది లేదని వారు హెచ్చరించారు.