నాల్గవ ఏడాది రెండో విడత రైతు భరోసా సాయం ఆళ్లగడ్డనుంచి విడుదల చేసిన జగన్ మాట్లాడుతూ... ‘‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి మూడు సంవత్సరాల నాలుగు నెలల పరిపాలనలో రైతులకు మంచి చేసే దిశగానే అడుగులు వేస్తూ వచ్చాం. మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలోని మిగిలిన 27 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా నిలిచాం. ప్రతీ అడుగులోనూ రైతుకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఇలా చెప్పడానికి మీ బిడ్డగా, రైతు బిడ్డగా గర్వపడుతున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ ద్వారా 1.25 ఎకరాలలోపు ఉన్న 70 శాతం రైతులకు పూర్తి పంట పెట్టుబడి సాయం అందించ గలుగుతున్నామన్నారు. ఏడాదికి మూడు విడతలుగా రైతు భరోసా సాయం అందిస్తున్నాం.ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో రైతు భరోసా కింద దాదాపుగా 50 లక్షల పైచిలుకు రైతులకు రూ.25,971 కోట్లు అందించామన్నారు. 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,096 కోట్లు జమ చేయనున్నామని సీఎం వైయస్ జగన్ వివరించారు. ఇప్పటి వరకు రైతుల కోసం రూ.1.33 కోట్లను ఖర్చు చేశామని చెప్పారు.