హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 23న ఆదివారం ధన త్రయోదశి వచ్చింది. పురాణాల ప్రకారం ఈ రోజునే లక్ష్మీదేవి, కుబేరుడు సాగర మథనం నుండి ఉద్భవించారు. అందుకే ఈ పవిత్రమైన రోజున ధన్వంతరి పూజలు చేస్తారు. దీపావళి పండుగకు ముందు వచ్చే ధన త్రయోదశి రోజున చాలా మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున బంగారు ఆభరణాలు, వెండి, విలువైన వస్తువులను కొనడం వల్ల తమకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అంతే కాదు లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజున మహాలక్ష్మిని పూజించడం ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల తమ కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
ధన త్రయోదశి రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు, చీపుర్లు తదితర వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఇదే రోజున నలుపు రంగు వస్తువులను పొరపాటున కూడా కొనకండి. చాలా మంది ధన త్రయోదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకుని దీపావళి పండుగ రోజున లక్ష్మీపూజను ప్రారంభిస్తారు. అయితే శాస్త్రాల ప్రకారం ఇలా చేయకూడదు. ధన త్రయోదశి నుండే దీపావళి, లక్ష్మీ పూజ ప్రారంభమవుతుంది కాబట్టి ముందుగానే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ధన త్రయోదశి రోజున ఏదైనా పాత్రలు కొనుగోలు చేస్తుంటే, వాటిని ఖాళీగా తీసుకెళ్లొద్దు. అందులో రూపాయి నాణేం లేదా ఇంకేదైనా వస్తువులను, వీలైతే తీపి పదార్థాలను ఉంచి ఇంటికి తీసుకెళ్లడం మంచిది.