అనంతపురం నగర పరిధిలోని ఆర్‌కే నగర్‌లోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. సీసీ కెమెరాలకు గమ్ అతికించారు. ఆ తరువాత ఇంటి తాళం పగలగొట్టి , తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. రూ.అర కోటి పైగా విలువైన 1.10 కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. అంత మొత్తంలో బంగారం దొరికిందన్న ఆనందంలో రెండు కిలోల వెండి సామగ్రిని వదిలి వెళ్లారు. రిటైర్డ్ ఈఈ సుబ్బరాయుడు, వెంకటలక్ష్మమ్మ దంపతులు ఆర్‌కే నగర్‌లో నివాసముంటున్నారు. మూడురోజుల క్రితం మదనపల్లిలోని సమీప బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం తిరిగి వచ్చి చూసేసరికి, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడ్డాయి. బీరువా తెరిచిచూస్తే బంగారు ఆభరణాలు కనిపించలేదు. భారీగా సొమ్ము దొంగలపాలు కావడంతో కాసేపు తేరుకోలేకపోయారు. ఆ తరువాత త్రీటౌన పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ కత్తి శ్రీనివాసులు సిబ్బందితో ఆ ఇంటిని పరిశీలించారు. ఆవరణలో ఉన్న మూడు సీసీ కెమెరాలకు గమ్ అతికించడంతో చోరీ దృశ్యాలు రికార్డు కాలేదని గుర్తించారు. దంపతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.