ఏదోరకంగా ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతిని, అల్లర్లను సృష్టించేందుకు చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న యాత్ర రైతుల యాత్ర అని పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. రైతుల ముసుగులో టీడీపీ, జనసేన నేతలు రాజమండ్రి ప్రజలపై దాడులకు తెగబడటం తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై రైతుల ముసుగులో ఉన్నవారు దాడులు చేశారన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని ముక్తకంఠంతో కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షను దెబ్బతీసేందుకు చంద్రబాబు, ఆయన తాబేదారులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. భూములిచ్చిన రైతుల మీద ప్రభుత్వానికి, వైయస్‌ఆర్ సీపీకి సానుభూతి ఉందన్నారు. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మూడు కమిషన్‌లు (జీఎన్‌రావు కమిషన్, బీసీజీ కమిషన్, హైపవర్ కమిషన్) వేశారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గుర్తుచేశారు. శివరామకృష్ణన్ కమిటీ చంద్రబాబుకు నివేదిక ఇస్తే దాన్ని పరిశీలన చేయకుండా చెత్తబుట్టలో పడేశారన్నారు. మూడు కమిటీల నివేదికలను పరిశీలన చేసిన సీఎం వైయస్ జగన్ ఉత్తమమైన నిర్ణయం తీసుకున్నారా..? శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టులను పరిగణలోకి తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు కరెక్టా..? అనేది ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారన్నారు.