తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పక అమలు జరిగేలా సంబంధిత శాఖలు చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ కె. వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ప్రమాదాలతో పోల్చుకుంటే 3శాతం అధికంగా జరిగాయని జీరో ప్రమాదాలు లక్ష్యంగా సంబందిత శాఖలు పని చేయాలని అన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే వైద్య సహాయం అందించేలా జిల్లా వైద్య శాఖ, పోలీసు, ట్రాన్స్పోర్ట్, శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రమాదం జరిగిన వివరాలను ఐ. ఆర్. ఎ. డి. వెబ్ సైట్ నందు పోలీసు, వైద్య శాఖలు నమోదు చేయాల్సి ఉంటుందని, ఈ వివరాలను కేంద్రంలో దేశంలోని ప్రమాదాలు ఒకే చోట చూసి, అధ్యయనం చేసి మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రధానంగా ప్రమాదం జరిగిన వెంటనే కాపాడిన వారికి గుడ్ సమరటిన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని ఇందుకు సంబందించిన పోస్టర్లను సచివాలయాలలో, ఆసుపత్రులలో, పోలీసు స్టేషన్ లలో ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బారీ వాహనాల డ్రైవర్ లకు విశ్రాంతి కొరకు వడమాలపేట వద్ద మల్టి కాంప్లెక్స్ నిర్మించనున్నామని అలాగే చిత్తూరు – నాయుడుపేట మద్యలో మరొకటి ఏర్పాటుకు సంబందిత ఆర్డిఓలు స్థల పరిశీలన చేయాలని సూచించారు.
భాకరాపేట ఘాట్ నందు చేపట్టవలసిన భద్రతా పనులను పూర్తి చేసినందుకు సంతోషమని అన్నారు. సి. మల్లవరం – గాజులమండ్యం రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కూడళ్ళలో సిగ్నల్స్ ఏర్పాటు, బ్లిన్కర్స్ ఏర్పాటు కావాలని ప్రస్తుతం మరమ్మత్తులు ప్రారంభించారని డిసెంబర్ నాటికి పూర్తి కావాలని సూచించారు. ప్రధానంగా ప్రస్తుతం గాజులమండ్యం – నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం సాగుతున్నదని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసు, ట్రాన్స్పోర్ట్, రెవిన్యూ సంయుక్త పరిశీలనతో అవసరమైన వేగనిరోదకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్ఐసి రోడ్డు భద్రతపై రహదారి దగ్గరలో ఉన్న సచివాలయాల వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ప్రమాదాల బారిన పడిన వారి ప్రాణాలు కాపాడేలా చూడాలని డివిజనల్ డెవలప్ మెంట్ అధికారి వెంటనే దృష్టి పెట్టాలని అన్నారు.