చిత్తూరు తాలూకాలో అక్రమంగా తరలిస్తున్న రూ.50 లక్షల ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ను అరెస్టు చేసి రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సోమవారం సీఐ మద్దయ్య ఆచ్చారితో కలిసి డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఇటీవల పోలీసులు నిఘా ఉంచారు. నిరంతరం వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ కార్యాచరణలో భాగంగా అందిన సమాచారం మేరకు ఆదివారం పెనుమూరు ఎస్‌ఐ అనిల్‌కుమార్, తాలూకా ఎస్‌ఐ రామకృష్ణ, ఎన్‌ఆర్‌పేట ఎస్‌ఐ ప్రతా్‌పరెడ్డి, ఐడీపార్టీ సిబ్బంది పెనుమూరు మండలం కొత్తరోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. నేండ్రగుంటవైపు నుంచి దేవళంపేట వైపుగా రెండు కార్లను తనిఖీ చేసారు. ఒకదానిలో తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలూకా పడవేడుకు చెందిన పి.వెంకటేశ్(29).. మరో వాహనంలో కన్నమంగళంకు చెందిన రాజు, జగన్ ఉన్నారు. ముందు పోలీసులు ఉన్నారని గ్రహించిన రాజు, జగన్ తమ కారును ఆపి పక్కనే ఉన్న అడవిలోకి పారిపోయారు.