ఏపీలోని కృష్ణా జిల్లాలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద ఆర్టీసీ బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సు గుడివాడ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది ఉన్నారు. ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపేశారు. ప్రయాణికులు, విద్యార్థులు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు.