వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ రెబల్ ఎంపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల నుంచి మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు రక్షణ కావాలనే పరిస్థితి ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదని ఆయన వెల్లడించారు. ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాను అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పరదాలు, బారి కేడ్స్ మధ్య ప్రజల్లోకి వస్తున్నారన్న ఆయన.. ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అదే పంథాను అనుసరించాలని ఎద్దేవా చేశారు. ఈ విషయం తెలియక ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చే ప్రజలను పోలీసులు కొట్టకుండా వారిని ఎమ్మెల్యేలకు దూరం చేస్తే మంచిదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహాలు చూపించుకొని అన్నింటిలో నెంబర్ వన్.. నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం తీరు విడ్డూరంగా ఉందన్నారు.
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను అడుగడుగునా పాలకులు అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు రఘురామ. ఇది రైతులకు పరీక్షా సమయం కాదని.. ప్రజాస్వామ్యానికే పరీక్ష అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనాగరికంగా సాగుతున్న అరాచకపు రాచరిక పాలన మధ్య ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలియజేయడానికి హాజరయ్యే వారిని.. వారికి కొంచెం దూరంగా ఉండి తమ సంఘీభావాన్ని తెలియజేయొచ్చని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపు లాయర్లు అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన తెలియజేసే అవకాశాన్ని కల్పించాలని కోరగా.. పాదయాత్రకు దూరంగా నిరసనను తెలియజేసుకోవచ్చునని జడ్జి ఆదేశించారన్నారు.
రాజకీయ కారణాలతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని వైఎస్ షర్మిల చెప్పారని.. అది నిజమే కావొచ్చని రఘురామ వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్యతో లబ్ధిదారులు ఎవరన్నది త్వరలోనే తేలనుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడడం మానేసి రాష్ట్ర కళ్యాణం కోసం పని చేస్తే బాగుంటుందన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి మరల్చేందుకే పవన్ కళ్యాణ్ వివాహాల ప్రస్తావన తీసుకు వస్తున్నారన్నారు. ఈ కారణంగా పవన్ కళ్యాణ్‌ను కూడా అరెస్టు చేస్తామని అంటారేమోనని, పోలీసు రాజ్యంలో ఏదైనా సాధ్యమేనన్నారు.
అమరావతి అంటే తమకేమీ కోపం లేదని, రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పకనే చెప్పారని రఘురామ అన్నారు. కర్నూలులో హైకోర్టు నిర్మిస్తే అభివృద్ధి జరిగిపోతుందని.. విశాఖలో గుండు కొట్టిన రుషికొండపై సచివాలయం నిర్మిస్తే సరిపోతుందని తమ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని అన్నారు. ఈనెల 27న హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. మానసికంగా సిద్ధపడుదామని రైతులకు రఘురామ సూచించారు. హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. కోర్టు అనుమతి ఇచ్చిన మేరకు 600 మంది పాదయాత్రను కొనసాగించాలన్నారు. ఒకవేళ ఎవరైనా అనారోగ్యం పాలైతే, కొత్తవారు దరఖాస్తు చేసుకొని పాదయాత్రలో పాల్గొనవచ్చునని తెలిపారు. కొంతమంది నాయకుల ముసుగులో అన్యాయం చేస్తున్నారని వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.