సిత్రాంగ్ తుఫాను బీభత్సం కొనసాగుతోంది. ఈశాన్య భారత రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురల్లో తుఫాను దాటికి ఇళ్లు దెబ్బతిన్నాయి. వేల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. ఆయా రాష్ట్రాల్లో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. "సిత్రాంగ్ తుఫాను మంగళవారం ఉదయం 5:30 గంటలకు అల్పపీడనంగా బలహీనపడింది. ఉదయం 8:30 గంటలకు ఈశాన్య బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న మేఘాలయలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో విస్తారమైన వర్షపాతం, వివిధ ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. వచ్చే 24 గంటలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయి.'' అని ఐఎండీ గౌహతి కార్యాలయం పేర్కొంది.