ఒకే దేశం ఒకే సారి ఎన్నికలు అని ప్రచారానికి తెరలేపిన బీజేపీ ప్రభుత్వం తాజాగా ఒకే దేశం.. ఒకే పోలీస్ యూనిఫామ్ అన్న నినాదం కూడా ఎత్తుకొంటోంది. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో రాష్ట్రాల హోం మంత్రులతో శుక్రవారం జరిగిన మేధోమథన సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం సాధ్యాసాధ్యాలపై చర్చించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది కేవలం ఓ ఆలోచన మాత్రమేనని, తప్పనసరి కాదన్న ప్రధాని.. దీనిపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆలోచించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ, దీనికి దేశ సమైక్యత, అఖండతలతో కూడా సంబంధం ఉంటుందని ప్రధాని ఉద్ఘాటించారు. సహకారాత్మక సమాఖ్యతత్వానికి ఈ చింతన్ శిబిరం అసాధారణ ఉదాహరణ అని పేర్కొన్నారు.
‘‘ఒకే దేశం.. ఒకే పోలీస్ యూనిఫామ్ కేవలం ఓ ఆలోచన మాత్రమే.. దీనిని మీపై రుద్దు ప్రయత్నం చేయడం లేదు.. కేవలం ఓ సూచన ఇది.. ఇది ఇప్పుడే జరగవచ్చు.. ఐదు, 50 లేదా 100 సంవత్సరాలలో జరగవచ్చు.. అయితే ఒక్కసారి ఆలోచించుకుందాం..’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. అలాగే, రాష్ట్రాలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవచ్చునని, పరస్పరం ప్రేరణ పొందొచ్చునని, ఐక్యంగా దేశ అభివృద్ధి కోసం పాటుపడవచ్చునని ప్రధాని అన్నారు. ఇది రాజ్యాంగ భావన అని, ప్రజల పట్ల మనకు కల కర్తవ్యమని మోదీవివరించారు.
శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. నేరస్థులు సరిహద్దుల వెలుపలి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పని చేయవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
ఇటువంటి నేరాల విషయంలో పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సమానమైన స్పందన రానంత వరకు, దీనిపై పోరాటానికి అన్ని రాష్ట్రాలూ కలిసిరానంత వరకు, వీటిని ఎదుర్కొనడం అసాధ్యమని మోదీ తెల్చిచెప్పారు. ఒకేవిధమైన శాంతిభద్రతల పాలసీ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపును కూడా ఆయన సమర్థించారు. ‘సహకార సమాఖ్య అనేది రాజ్యాంగ భావన మాత్రమే కాదు, రాష్ట్రాలు, కేంద్రం బాధ్యత కూడా’ అని ప్రధాని అన్నారు. శాంతిభద్రతలు, రక్షణకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని ఏజెన్సీల సమన్వయంతో కూడిన చర్య కోసం తాను ప్రయత్నిస్తున్నందున పాత చట్టాలను సమీక్షించి, వాటిని ప్రస్తుత పరిస్థితులకు సవరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని మోదీ కోరారు.