భారతదేశంలో ఓ అద్భుత ఘటన జరగబోతోంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన శివుడు విగ్రహం ‘విశ్వాస్ స్వరూపం’ రాజస్థాన్‌లో నేడు (శనివారం) ప్రారంభించనున్నారు. రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారా పట్టణంలో 369 అడుగుల ఎత్తైన భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహంగా పేర్కొంటున్న దీనిని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ , అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, ఇతరుల సమక్షంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారీ బాపు ప్రారంభిస్తారు. ఉదయ్‌పూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని నాథ్‌ద్వారాలో ఈ విగ్రహాన్ని తాట్ పదమ్ సంస్థాన్ నెలకొల్పింది. సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ ఛైర్మన్ మదన్ పలీవాల్ మాట్లాడుతూ.. విగ్రహావిష్కరణ సందర్భంగా అక్టోబరు 29 నుంచి నవంబరు 6 వరకు తొమ్మిది రోజుల పాటు పలు మతపరమైన, ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రామకథను ఈ తొమ్మిది రోజులూ మొరారీ బాపు గానం చేయనున్నారు.
‘‘శ్రీనాథ్‌జీ నగరంలో ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన శివుని విగ్రహం మతపరమైన పర్యాటకానికి కొత్త అర్ధాన్ని ఇస్తుంది’’ అని పలివాల్ అన్నారు. దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో కొండపైన నెలకొల్పిన ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచి కనిపిస్తుంది. ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటుచేయడం వల్ల రాత్రిపూట కూడా విగ్రహాన్ని స్పష్టంగా చూడొచ్చని సంస్థాన్ అధికార ప్రతినిధి జయప్రకాశ్ మాలీ తెలిపారు.
‘‘ఇది ప్రపంచంలోనే అతిపెత్తైన శివుడి విగ్రహం.. లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేక హాల్‌ను నిర్మించాం.. లోపలి నుంచి నాలుగు లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి’’ అని తెలిపారు. విగ్రహ నిర్మాణం కోసం మూడు వేల టన్నుల స్టీలు, ఐరన్. 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకను వినియోగించారు. విగ్రహ నిర్మాణం కోసం పదేళ్లు పట్టింది. ఈ ప్రాజెక్ట్‌కు 2012 ఆగస్టులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మొరారీ బాపులు శంకుస్థాపన చేశారు. 250 కిలోమీటర్ల వేగంతో శక్తివంతమైన గాలులు వీచినా చెక్కుచెదరనంత బలంగా 250 ఏళ్లు నిలిచేలా విగ్రహ నిర్మాణం సాగిందని మాలీ పేర్కొన్నారు. ఈ విగ్రహం రూపకల్పనకు సంబంధించిన విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో జరిగిందని చెప్పారు.
విగ్రహం నెలకొల్పిన ప్రదేశం చుట్టూ బంగీ జంపింగ్, జిప్ లైన్, గో-కార్ట్ వంటి కార్యకలాపాలు, పర్యాటకులు ఆస్వాదించే ఫుడ్ కోర్ట్, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్‌ను ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి ఎత్తయిన శివుడి విగ్రహంగా నేపాల్‌లోని కైలాసనాథ మహదేవ విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎత్తు 143 అడుగులు. 2011 జూన్ 21న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేపాల్‌లోని భక్తాపూర్ జిల్లాలోని సాంగ ప్రదేశంలో దీన్ని నెలకొల్పారు.