నవమాసాలు మోసి పెంచి, ప్రయోజకులను చేసిన ఓ తల్లిని కసాయి పిల్లలు రోడ్డున పడేశారు. వివరాలలోకి వెళ్లితే...ముగ్గురు కొడుకులు.. అందరూ వెల్ సెటిల్.. ఏం లాభం.. కన్న తల్లిని చూసుకునే తీరిక లేదు. 40 ఏళ్లుగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే.. చివరి మెడ పట్టుకుని బయటకు గెంటేశారంటూ.. ఓ తల్లి హెచ్చార్సీ ముందు గోడు వెల్లబోసుకుంది. ఆ 82 ఏళ్ల వృద్ధురాలి బాధ తెలియాలంటే.. ఆమె గాథ తెలుసుకోవాల్సిందే.. హైదరాబాద్‌కు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలికి శంకర్, హనుమంతు, శివాజీ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. 40 సంవత్సరాల క్రిందటే గంగమ్మ భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ముగ్గురు కొడుకుల బాగోగులు చూసుకుంటూ.. వాళ్లను ప్రయోజకులను చేసింది. ముగ్గురికి వివాహాలు కూడా చేసింది. అంతేనా.. వాళ్ల పిల్లలకు కూడా చేయవలసిన సేవలు అన్ని చేసింది. ఇప్పుడు వృద్ధాప్యానికి తోడు అనారోగ్య సమస్యలు దండెత్తటంతో.. చాలా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఇలాంటి సమయంలో తల్లి సేవ చేయాల్సిన కొడుకులు మాత్రం.. అవసరం తీరగానే గంగమ్మను బయటకి తరిమేశారు. 20 సంవత్సరాల నుంచి ముగ్గురు కొడుకులు.. గంగమ్మ బాగోగులు చూడట్లేదు. కనీసం తిండి పెట్టకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా.. ఇంటికి వెళ్తే మెడ బట్టి బయటికి గెంటేశారు.
ఆత్మాభిమానం ఉన్న గంగమ్మ ఎవరి మీద ఆధారపడకుండా.. ఇండ్లలో పని చేసుకుంటూ ఇన్ని రోజులు జీవనం కొనసాగించింది. కానీ.. ప్రస్తుతం గంగమ్మకు 80 సంవత్సరాలు పైబడటంతో పని చేయడం చేతకాకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దానికి తోడు ఆమె ఆరోగ్యం కూడా క్షీణిస్తుండటం వల్ల.. ఆస్పత్రులకు వెళ్లి చూపించుకోడానికి కూడా డబ్బులు లేక బాధ అనుభవిస్తోంది. మరోవైపు.. గంగమ్మ కొడుకులు జీవితాల్లో బాగా సెటిల్ అయ్యారు. తల్లిని మాత్రం బాగా చూసుకోవట్లేదు. ఈ క్రమంలో.. తనకు న్యాయం కావాలంటూ.. గంగమ్మ మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించింది. హెచ్చార్సీ ముందు తన గోడు మొత్తం వెల్లబోసుకుని.. తనకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది.
తన ముగ్గురు కొడుకులు బిజినెస్ చేసుకుంటున్నారని.. పెద్ద పెద్ద ఇల్లు నిర్మించుకొని హాయిగా జీవితం కొనసాగిస్తున్నారని.. కార్లలో దర్జాగా తిరుగుతున్నారని.. తనను మాత్రం పట్టించుకోవడం లేదంటూ మానవ హక్కుల కమిషన్ ముందు గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తాను చనిపోయే వరకు తన కొడుకులు సహాయం చేసేలా చూడాలంటూ మానవ హక్కుల కమిషన్‌ను కోరింది. వృద్ధురాలి ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ.. వెంటనే స్పందించి విచారణ చేపట్టింది.
ప్రతీ తల్లిదండ్రి తమ పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకుంటారు. వారు ఏది కోరితే అది తీసుకువచ్చి ఇవ్వడమే కాకుండా చదువు సందెలు నేర్పించి వాళ్లను ప్రయోజకులను చేస్తారు. ఇంత కష్టపడిన తల్లిదండ్రులను మాత్రం కొందరు పిల్లలు.. చివరి రోజుల్లో అనాథలుగా రోడ్డుపై వదిలేస్తున్నారు. సమాజంలో చాలామంది ఒక ఉన్నత స్థాయికి రాగానే కనీ పెంచిన తల్లిదండ్రులను మరిచిపోయి కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. అసలు తల్లిదండ్రుల గురించి పట్టించుకోవడమే లేదు. ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు ఎంతో మనోవేదన అనుభవిస్తున్నారు.