రుషికొండ దగంగక నిరసన తెలియజేయడానికి వెళ్తే పోలీసులు నిర్బంధ చేస్తారా అంటూ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. పార్టీ ఆఫీసుకు వెళ్తుంటే అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్య అంటూ ఆమె మండిపడ్డారు. పోలీసులపై ప్రైవేట్ కేసు వేస్తానని.. ఎవడినీ వదిలిపెట్టను అన్నారు. పోలీసులు నేమ్ ప్లేట్స్ లేకుండా డ్యూటీ చేస్తున్నారని.. విశాఖలో పోలీసులు ప్రతిపక్ష నాయకులు దగ్గర కాపలా కాస్తే క్రైమ్ రేటు ఎందుకు తగ్గుతుంది.. నగరంలో క్రైమ్ రేటు పెరుగుతుంది అన్నారు.
రుషికొండ దగ్గర ఏమి జరగకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లో అరెస్ట్ లు చేసి గృహ నిర్బందాలు చేసి ఇబ్బందులు పెడుతున్నారని.. తాము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలి పెట్టేది లేదన్నారు. అక్రమాలు జరగకపోతే భయం ఎందుకు? రుషికొండకు వెళ్తుంటే అడ్డగింతలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. కనీసం వాహనాలను కూడా అనుమతించలేదని.. నడిచి పార్టీ ఆఫీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను పిల్లలతో సినిమాకు వెళితే అక్కడికి పోలీసులు వచ్చారని.. తన ప్రైవసీకి భంగం కలిగిందన్నారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు.
ఉత్తరాంధ్ర పోరుబాటలో భాగంగా రుషికొండ దగ్గర నిరసనకు టీడీపీ పిలుపునివ్వగా... పోలీసులు ఎక్కడికక్కడ తెలుగు దేశం నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులను తప్పించుకున్న టీడీపీ కార్యాలయాన్ని చేరుకున్న పలువురు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. అనకొండ నోటిలో రుషికొండ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనకొండ సీఎం.. అక్రమ నిర్మాణాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. నిరసనలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ పార్టీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
ఉత్తరాంధ్ర పోరుబాటలో భాగంగా రుషికొండ దగ్గర నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమై టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయంతో పాటు రుషికొండ వద్ద పోలీసుల్ని మోహరించారు. రుషికొండకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేపట్టారు. రుషికొండ నుంచి బీచ్ రోడ్‌వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. టీడీపీ నేతల అరెస్ట్‌లపై అధినేత చంద్రబాబు స్పందించారు.
కొండలను మింగిన వైఎస్సార్‌సీపీ అనకొండల బండారం బయట పడుతుందనే టీడీపీ పోరుబాట పై ఆంక్షలు విధించారంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్రలో వైసీపీ దోపిడీపై టీడీపీ పోరుబాటను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. కొండలను సైతం మింగుతున్న వైసీపీ అనకొండల బండారం బయట పెట్టేందుకే నేతలు పోరుబాట పట్టారని.. మహిళా నేతలను సైతం నిర్బంధించడం పాలకుల అరాచకత్వానికి నిదర్శనమన్నారు.
ఉత్తరాంధ్రలో ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులను దోచుకున్నందునే టీడీపీ పోరుబాట పై ప్రభుత్వం భయపడుతుంది. ఎవరు ఎంతగా అడ్డుకున్నా 'సేవ్ ఉత్తరాంధ్ర' నినాదం ఆగదన్నారు. రుషికొండ విధ్వంసం, దసపల్లా భూముల దోపిడీలు, ఆస్తుల ఆక్రమణలు, గంజాయి సాగు-అమ్మకాలు, అక్రమ మైనింగ్ పై వైసీపీ దారుణాలను ప్రజల ముందు ఉంచి తీరుతాం. ఉత్తరాంధ్రకు అండగా నిలుస్తామన్నారు.
ముఖ్యమంత్రి జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్న వ్యవహారాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే.. టీడీపీ నేతల్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఉద్దేశపూర్వకంగానే ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర పోరుబాటకు బయలుదేరుతున్న టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గౌతు శిరీష వంటి నేతలను నిర్బంధించడాన్ని బట్టి చూస్తే జగన్ వెన్నులో వణుకు మొదలైనట్లు స్పష్టమవుతోంది అన్నారు. ఉత్తరాంధ్రలో జె-గ్యాంగ్ దోపిడీ బండారాన్ని బయటపెట్టేందుకు బయలుదేరిన టీడీపీ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గళాలపై జగన్ పోలీసులతో చేయిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుబాటను విజయవంతం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.