గత కొంత కాలంగా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఒకదాని తర్వాత ఒకటిగా అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌కు బదులుగా రిషబ్ పంత్‌ను వరల్డ్ కప్‌కు వికెట్ కీపర్‌గా బీసీసీఐ ఎంపిక చేసిందని క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు విమర్శించారు. ఇప్పటివరకు టీమ్ ఇండియా వరల్డ్ కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడగా, ఆ రెండింటిలోనూ రిషబ్ పంత్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. పంత్ స్థానంలో వికెట్ కీపర్‌గా కార్తీక్‌కి అవకాశం లభించింది. జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న పంత్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. హిట్టింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. రిషబ్ పంత్ ఐపీఎల్ తర్వాత తన బ్యాటింగ్ శైలిని మెరుగుపరుచుకునేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని సలహాలు కోరిన సంగతి తెలిసిందే. ఎక్కువ సమయం పాటు క్రీజులో నిలదొక్కుకోవడమే కాకుండా హిట్టింగ్ చేయడంలో ధోనీ అతడికి విలువైన సలహాలను అందజేసినట్లు చెబుతున్నారు. పంత్‌తో పాటు హార్దిక్ పాండ్యకు బ్యాటింగ్‌లో మెళుకువలను ధోనీ నేర్చించినట్లు తెలిసింది. టీ20 లో సులభంగా భారీ షాట్స్ కొట్టడం కోసం రౌండ్ బాటమ్ బ్యాట్స్ ఉపయోగించమని పంత్, హార్దిక్ పాండ్యలకు ధోనీ సూచించినట్లు తెలుస్తుంది.