పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ కే. కే. ఎన్ అన్బురాజన్ శనివారం నగరంలోని ఉమేష్ చంద్ర స్మారక పోలీస్ కళ్యాణ మండపంలో పోలీసు, హోమ్ గార్డ్స్, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు, విశ్రాంత సిబ్బందికి ఉచిత మెగా మెడికల్ క్యాంపు ను ప్రారంభించారు. పోలీసు సంక్షేమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, ఫిజీషియన్, గైనకాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజి, లాపరోస్కోపీ, ఆప్తాల్మాలజి, వంటి విభాగాలలో అరుణాచల హాస్పిటల్స్, శ్రీశ్రీ హోలిస్టిక్, సహస్ర, అవ్వారు, పల్లా, పుష్పగిరి ఐ హాస్పిటల్, కడప హాస్పిటల్ లకు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు డా. నిరంజన్ రెడ్డి, డా. స్రావం కుమార్ రెడ్డి, డా. క్రాంతి కుమార్, డా. అవ్వారు అర్జున్, డా. ఎం. సునీల్ దత్తు, డా. బి. మహేష్, డా. పి. అభిలాష్, డా. డి. చైతన్య రెడ్డి, డా. ఆర్. మమతేశ్వరి, డా. ఆర్. శిరీష, డా. పి. ఎ తేజస్విని, డా. ఓంప్రకాష్ వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పోలీస్ సంస్మరణ వారోత్సవాలు అక్టోబర్ 21 నుండి నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని, ఇందులో భాగంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపును పోలీసు సిబ్బంది, విశ్రాంత సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కొరకు ఏర్పాటుచేయటం జరిగిందని తెలియజేశారు. పోలీసు విధులు చాలా కష్టంతో కూడుకున్నవని, వారి డ్యూటీ సమయాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయని, ఆహారం కూడా సమయానికి తీసుకోలేని పరిస్థితులు ఉంటాయని, విధి నిర్వహణలో వారి ఆరోగ్య ప్రాధాన్యత కంటే ప్రజా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించి, ఆరోగ్యపరమైన సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని జిల్లా ఎస్. పి పేర్కొన్నారు.