కొత్తవలస జంక్షన్లోనున్న శ్రీనివాస సెల్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు 21 సెల్ఫోన్లను చోరీ చేసినట్టు యజమాని నెమలి శ్రీనివాసరావు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస జంక్షన్లో శ్రీనివారావు సెల్ షాపును ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత షాపును మూసేసి ఇంటికి వెళ్లిపోయారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో షాపు తాళాలు పగుల గొట్టి ఉండడం చూసి, లోపలికి వెళ్లి చూడగా షాపులోని 21 మొబైల్ ఫోన్లు పోయినట్టు గుర్తించారు. వీటి విలువ సుమారు ఒక లక్షా 5వేలు ఉంటుందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బాల సూర్యారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.