ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీకి అందని ద్రాక్షగా..మంగళగిరి నియోజకవర్గం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 30, 2022, 03:38 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గంలో కాలు మోపడం టీడీపీకి ఓ సవాల్ గా మారింది. ఓ రకంగా ఈ నియోజకవర్గం  టీడీపీకి 25 ఏళ్లుగా అందని ద్రాక్షగా మారింది. టీడీపీకి ఓ నియోజకవర్గం దాదాపు 25 ఏళ్లగా దక్కలేదంటే నమ్ముతారా.. అవును నిజమే. ఎన్నో ఏళ్లుగా ఆనియోజకవర్గం పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించడం.. పోటీ చేసినా గత రెండు టర్ముల్లోనూ ఓడిపోతూ వస్తోంది. ఎప్పటి నుంచో అందని ద్రాక్షగా మారింది. మరోసారి ఈ తప్పు జరగకుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకెళుతోంది టీడీపీ.. 2024లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఇంతకీ టీడీపీకి తలనొప్పిగా మారిన ఆ నియోజకవర్గం ఏది అనుకుంటున్నారా.. గుంటూరు జిల్లా మంగళగిరి.


టీడీపీ మంగళగిరిలో 1983–1985, 1985–1989 మినహా అక్కడ గెలించింది లేదు. ఆ తర్వాత పొత్తుల్లో భాగంగా సీట్లను మిత్ర పక్షాలకు కేటాయిస్తున్నారు. 1989 నుంచి 2009 వరకు జరిగిన 5 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చింది. పొత్తుల్లో మంగళగిరి సీటు వేరే పార్టీలకు ఇవ్వడంతో టీడీపీ అక్కడ బలోపేతం కాలేదనే భావన చంద్రబాబుకు ఉంది. 2014లో పోటీచేసినా విజయం దక్కలేదు. 2019 ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. అంటే మొదటి నుంచి టీడీపీకి మంగళగిరి పెద్ద తలనొప్పి అనే చెప్పాలి.


1983, 1985లో టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్.ఎస్.కోటేశ్వరరావు విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ నుంచి గోలి వీరాంజనేయులు విజయం సాధించారు. 1994లో సీపీఐ నుంచి నిమ్మగడ్డ రామ్మోహ‍న్ రావు గెలిచారు. 1999–2004 కాంగ్రెస్ తరఫున మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో ఆయనే గెలిచారు. 2009లో మాత్రం కాంగ్రెస్ నుంచి కాండ్రు కమల విజయాన్ని అందుకున్నారు. 2014, 2019లో ఆర్కే విజయం గెలిచారు.


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిర బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి కాస్త మారింది. 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత మంగళగిరి నియోజకవర్గంపై లోకేష్ మరింత ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో పార్టీ యాక్టివిటీ పెంచడం, కార్యకర్తల సంక్షేమంతో పాటూ ఇతర కార్యక్రమాల కారణంగా మంచి మార్పు కనిపిస్తుందని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈసారి కచ్చితంగా మంగళగిరిలో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. లోకేష్ కూడా తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ.. పార్టీ తరఫున సాయంతో పాటు.. తాను సొంతంగా 12కి పైగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి కచ్చితంగా తిరుగులేని విజయం సాధిస్తానని లోకేష్ కూడా ధీమాతో ఉన్నారు.


2024లో ఎలాగైనా విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న లోకేష్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం అవుతుందని భావించిన ప్రతిసారీ ఇబ్బందులు తప్పడం లేదు. 2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కీలక నేతలు టీడీపీని వీడారు. గతంలో కాంగ్రెస్‌‌లో ఉన్న మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల 2019 జనవరిలో టీడీపీలో చేరారు. కానీ రెండు నెలలు కూడా గడవకముందే వైఎస్సార్‌సీపీలో చేరారు. తనకు మంగళగిరి సీటు వస్తుందని భావించినా రాదని నిర్ణయించుకుని కుండువా మార్చేశారు. ఆమె స్థానికంగా బలమైన సామాజిక వర్గం నేత కావడంతో.. ఆమె పార్టీ మారిన ప్రభావం కొంతమేర లోకేష్‌కు డ్యామేజ్ చేసింది.


ఇంతలో మంగళగిరి నియోజకవర్గంలో మరో కీలక నేత, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు టీడీపీకి రాజీనామా చేశారు. తనకు పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లేదని వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోయారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. 1999, 2004లో హనుమంతరావు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. మంత్రిగా కూడా పని చేశారు. ఈ రెండు ఎదురు దెబ్బల తర్వాత మరో కీలక నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు.


మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంజి చిరంజీవి వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. చిరంజీవి మంగళగిరిలో కీలక నేతగా ఉన్నారు.. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ పదవి దక్కగా.. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడంతో గంజి చిరంజీవికి సీటు రాలేదు. ఎన్నికల తర్వాత కూడా పార్టీలో కొనసాగారు. ఇలా వరుసగా ముగ్గురు నేతలు టీడీపీని వీడారు. అయినా సరే లోకేష్ మాత్రం వెనక్కు తగ్గలేదు.. నియోజకవర్గంలో పర్యటిస్తూ జనాలతో మమేకం అవుతున్నారు. 2024లో గెలుపు తనదేనని ధీమాతో ఉన్నారు. మరి 25 ఏళ్లగా టీడీపీకి దక్కని మంగళగిరి.. ఈసారైనా కలిసొస్తుందా లేదా అన్నది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa