అభివృద్ధే మన అజెండా అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఒంగోలు ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మూడో డివిజన్ అయిన కరుణాకాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లింల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. వాసన్నా అంటూ ఆప్యాయతను కనబరిచారు. కరుణాకాలనీలో కబేలా స్థలం ఖాళీగా ఉందని, దానిని కమ్యూనిటీ స్థలం కోసం కేటాయిస్తే తమ ప్రాంతంలో ఇబ్బందులు తొలగిపోతాయంటూ పలువురు ప్రజలు బాలినేనికి విజ్ఞప్తి చేశారు. దీనిని వెంటనే పరిశీలించి నివేదిక అందజేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ను బాలినేని ఆదేశించారు. అదే విధంగా కొంతమంది పరిస్థితి దయనీయంగా ఉండడం చూసి చలించిన బాలినేని అక్కడికక్కడే వారికి కొంత మొత్తం ఆర్థిక సాయం అందించారు. అదే విధంగా మరికొంతమంది డ్రైనేజీ కాలువలు మరమ్మతులు చేపట్టాలని కోరారు. విద్యుత్ లైన్లు ఇళ్లకు అందుబాటులో ఉంటున్నాయని, తద్వారా ప్రమాదం జరిగే ఉందంటూ వివరించారు. రేషన్ బియ్యం, సంక్షేమ ఫలాలతోపాటు ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా లేదా అంటూ బాలినేని అడిగి తెలుసుకున్నారు.