జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు నాలుగు నాలుకలు ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఏదైనా ఒక రాజకీయ పార్టీలో అత్యంత ఉన్నత ప్రాధాన్యత కలిగి ఉండేది రాజకీయ వ్యవహారాల కమిటీ. ఆ సమావేశం అనేది చిన్న రాజకీయ పార్టీ అయినా, లేదా దేశాన్ని పాలించే పార్టీ అయినా చాలా ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రజల కోసం ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుందనే వాటిపై రాజకీయ నిర్ణయాలు చేస్తారు. కానీ ఇవాళ కొండను తవ్వి, ఎలుకను తీసినట్లు, ఒక రాజకీయ పార్టీ పీఏసీ సమావేశంలో వారం క్రితం చేసిన తీర్మానాలనే మరోసారి ఆమోదించారు. ఎవరెవరో తమను పలకరించడానికి వచ్చారట. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం. రాష్ట్రంలో మంత్రుల మీద దాడి, మహిళా మంత్రులను అసభ్య పదజాలంతో దూషించి, భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులను అభినందిస్తూ, వారికి అండగా నిలబడిన వారి నాయకుడిని అభినందిస్తూ మరో తీర్మానం. గొప్ప రాజకీయ పార్టీ. గొప్ప తీర్మానాలు. ఇక ఆ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆరేళ్లపాటు హైసెక్యూరిటీ జోన్‌లో రాజకీయాలు చేశాడట. ఆయన అంటున్నాడు. తనకు సెక్షన్–30 ఉన్నదని తమకు తెలియదని. దాని గురించి ఎవరూ చెప్పలేదని పవన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మైల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో మాట్లాడారు.