చిత్తూర్ జిల్లా, కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం జలాశయం నుంచి 1.70 క్యూసెక్కుల నీటిని ఆదివారం రాత్రి విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఉన్న మూడు గేట్లలో ఒకదానిని ఒక ఇంచు మేరకు ఎత్తి నీటిని వదిలారు. వర్షాకాలంలో ప్రాజెక్టు గేట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఏటా ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు. ఇక, వాయుగుండం ప్రభావంతో వర్షాలు వచ్చే అవకాశాలు ఉండటంతో ప్రాజెక్టులోని నీటిని దిగువ ప్రాంతానికి వదిలినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాగా, కృష్ణాపురం ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు సైరన్ మోగిస్తారు. తద్వారా ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఈ ఏడాది అలాంటి జాగ్రత్తలు పాటించలేదు. విడుదల చేసిన నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో దిగువ ప్రాంతంలో కేపీ అగ్రహారం, అమ్మపల్లి, ముక్కరవాని పల్లి,కొల్లాగుంట ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.