కల్లు గీత కార్మికుల జీవితాల్లో భరోసా కల్పించే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త పాలసీ తెచ్చారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. అద్భుతమైన పాలసీ తెచ్చినందుకు ముఖ్యమంత్రికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రైతుల యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే ఎక్కడికీ వారిని దేవుడు రానివ్వడం లేదని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..... గీత కార్మికుల కష్టాలు గుర్తించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్, గీత వృత్తిదారుడు ప్రమాదానికి గురైతే.. రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా అందే విధంగా, అంటే వైయస్స్ఆర్ బీమా నుంచి రూ. 5 లక్షలు, ప్రభుత్వం నుంచి మరో రూ. 5 లక్షలు ఇవ్వాలని నూతన పాలసీలో ప్రకటించారు. ఇటువంటి పరిహారం దేశంలో మరెక్కడా లేదు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో అత్యధికంగా గీత కార్మికులు ఉంటారు. దేశం మొత్తం మీద 8.51 కోట్ల తాటిచెట్లు ఉంటే.. ఒక్క తమిళనాడులోనే 5.31 కోట్ల చెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ రాష్ట్ర వృక్షం తాటిచెట్టే. అయినా, ఆ రాష్ట్రంలో ఎక్స్ గ్రేషియా చాలా తక్కువ. అసంఘటిత కార్మికులు మరణించిన సందర్భాల్లో ఇస్తున్నట్టు మాత్రమే పరిహారం ఇస్తున్నారు. దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ప్రమాద బీమా, ఎక్స్ గ్రేషియా రూ. 10 లక్షలు ఇస్తున్నది మనమే. పక్క రాష్ట్రం తెలంగాణలో చూసినా, కేవలం రూ. 5 లక్షలు మాత్రమే బీమా కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని 95, 245 కల్లు గీత కార్మికుల కుటుంబాలకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు అని తెలియజేసారు.