రోడ్లపై గుంతలు పూడ్చలేని వైసిపి ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం విడ్డూరంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. తాడేపల్లి మండలం ఇప్పటంలో శనివారం ఇళ్లు తొలగించడాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ జేసీబీలు పేదలు రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లను నేలమట్టం చేస్తున్నాయని అన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో సీఎం ఇంటి పక్కన పేదల ఇళ్లు కూల్చడంతో మొదలైన విధ్వంసం కొనసాగుతూనే ఉందని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇళ్లు కూల్చడం ఎమ్మెల్యే ఆర్కేకి వ్యసనంగా మారిపోయిందని విమర్శించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పేదల ఇళ్లు కూల్చారని, ఇప్పుడు కనీస సమాచారం ఇవ్వకుండా రోడ్డు విస్తరణ పేరుతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.