ఏపీ రాజదాని విషయంలో మరో సారి సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మరోమారు విచారణ వాయిదా పడింది. ఈ నెల 14న అమరావతి పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఏపీ రాజధాని అమరావతేనని, దానిని నిర్ణీత కాల వ్యవధిలోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో తమనూ ఇంప్లీడ్ చేసుకోవాలంటూ అమరావతి రైతులు మరో పిటిషన్ దాఖలు చేశారు. కొందరు వ్యక్తులు కూడా ఈ వ్యవహారంపై పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అన్ని పిటిషన్లను కలిపి ఓకేసారి విచారణ చేపట్టనున్నట్లు గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఈ నెల 1న అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే సీజేఐ జస్టిస్ లలిత్... నాట్ బిఫోర్ మీ అంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్లను మరో బెంచ్ కు బదిలీ చేయాలని, ఈ నెల 4న వాటిపై విచారణ చేపట్టాలని కూడా జస్టిస్ లలిత్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ పిటిషన్లు లిస్ట్ అయిన బెంచ్ వద్దకు వెళ్లిన అమరావతి రైతుల తరఫు న్యాయవాది వికాస్ సింగ్... బెంచ్ కార్యకలాపాలు ముగుస్తున్నా తమ పిటిషన్ విచారణకు రాని విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అమరావతి పిటిషన్లపై విచారణను ఈ నెల 14న చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.