విద్యుత్ ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాల్సిందిగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంధన శాఖ అధికారులతో ఆయన ఆదివారం టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల అనంతపురం జిల్లాలో విద్యుత్ ప్రమాదం జరిగిన వెంటనే సీఎం వైయస్ జగన్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలను పరిహారంగా అందజేశారని, అయితే మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. విద్యుత్ సంస్థల బలోపేతానికి ఇప్పటికే రూ.40వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు విద్యుత్ భద్రత కల్పించే విషయంలో ఎంత వ్యయం చేసేందుకైనా వెనుకాడదని పెద్దిరెడ్డి స్పష్టంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ భద్రతకు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులను అధ్యయనంచేసి తగిన కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు.