మంగళగిరి ఎయిమ్స్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలోనే ఎయిమ్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పన జరిగిందన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను మంత్రి విడదల రజిని సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి విడదల రజిని మీడియాతో మాట్లాడారు. ‘‘విభజన చట్టం ప్రకారం ఎయిమ్స్ ఏపీకి హక్కుగా వచ్చింది. జగనన్న ప్రభుత్వంలో ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. రూ.55 కోట్లతో ఎలక్ట్రిసిటీ, రోడ్స్, డ్రైన్స్ వంటి తదితర సదుపాయాలు పూర్తిగా కల్పించాం. ఇంకా ఏం కావాలో ఆస్పత్రిని యాజమాన్యాన్ని అడిగి తెలుసుకొని నోట్ చేసుకున్నాం. ఏఎంఆర్ (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్)కు సంబంధించి ఎయిమ్స్‌తో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోబోతుంది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎయిమ్స్‌ను తీసుకొచ్చినట్టయితే రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువ శాతం సర్వీసెస్‌ను కల్పించవచ్చు. ఎయిమ్స్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడానికి మేనేజ్‌మెంట్, డైరెక్టర్ సానుకూలంగా స్పందించారు. రానున్న కాలంలో ఎయిమ్స్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి ఉచితంగా మంచి వైద్యాన్ని అందిస్తాం’’ అని మంత్రి రజిని చెప్పారు.