నిరుద్యోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వారిని మోసం చేసి సొమ్ము చేసుకుంటున్న వారు అధికమయ్యారు. ఈమేరకు పోలీసులకు ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఒంగోలు ఎస్పీ కార్యాలయం ఆవరణలోని గెలాక్సీ భవనంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్పీ కి అందిన 70 వినతుల్లో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఫిర్యాదులు ఎక్కువగా ఉండటం గమనార్హం. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రూ.4.60లక్షలు నగదు తీసుకొని మోసం చేశాడని నగరంలోని బాల కృష్ణాపురానికి చెందిన షేక్ బాషా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లింగంగుంట్ల క్రాంతికుమార్ అనే వ్యక్తి ఒంగోలులోని ట్రిపుల్ ఐటీలో రికార్డు అసిస్టెంట్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడని టంగుటూరు మండలం కారుమంచికి చెందిన చాట్ల సంతోష్‌కుమార్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. భాగ్యనగర్ ఐదో లైన్‌లో నివాసం ఉండే క్రాంతికుమార్ తనతోపా టుగా మరో ముగ్గురి వద్ద మొత్తం రూ.5.40 లక్షలు తీసుకున్నాడని, నకిలీ నియా మక పత్రాలు ఇచ్చి మోసం చేశాడన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే బెదిరిస్తున్నాడని తెలిపారు.