ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) కావలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక షాదీ మంజిల్ నందు మూడవ పట్టణ మహాసభ ఎస్. ఆనందరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి కే. పెంచల నరసయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలన్నారు. మునిసిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని గతంలో వైసిపి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన వెంటనే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ పర్మినెంట్ చేస్తామని, అప్పటివరకు కనీస వేతనం రూ. 26, 000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
మూడున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇంతవరకు దాని గురించి పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఏదో ఒక రూపంలో వారిని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న హెల్త్ అలవెన్స్ తిరిగి కార్మికుల ఖాతాల నుండి జమ చేసుకుంటామని చెప్పడం దారుణమన్నారు.
ఈ మహాసభలో యుటిఎఫ్ నాయకురాలు బి. శ్రీదేవి, సిఐటియు నాయకులు పి. పెంచలయ్య, టి. సుబ్బరాయ శర్మ, వై. రవి, డివైఎఫ్ఐ నాయకులు పి. పెంచల నరసింహ, వై. కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.