అప్పుల బాధతో కౌలురైతు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇంకొల్లులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. మిర్చి సాగు చేసే ఆవుల లక్ష్మీనారాయణ అనే రైతు వ్యవసాయం కారణంగా పేరుకుపోయిన అప్పులు తీర్చే మార్గం కానరాక బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కాగా లక్ష్మీనారాయణ పదిహేను రోజుల క్రితం కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా తాము గమనించి రక్షించుకున్నామని ఆయన కుమారుడు సురేష్ చెప్పారు.
అయితే ఈసారి అందరూ నిద్రించిన సమయంలో బుధవారం అర్ధరాత్రి లక్ష్మీనారాయణ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని సురేష్ తెలిపారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు విషయం తెలిసి తాము వెళ్లి చెరువులో నుండి మృతదేహం వెలికి తీసి ఇంటికి తీసుకొచ్చామన్నారు. ఇంకొల్లు పోలీసులకు సమాచారం అందించామని సురేష్ చెప్పాడు.