నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ రానున్నారు. శుక్రవారం సాయంత్రం 7. 25 కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానం లో విశాఖ చేరుకొనున్నారు. ఈ మేరకు ఐఎన్ఎస్ డేగా లో రాష్ట్ర గవర్నర్, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌక దళ కేంద్ర కార్యాలయం వద్ద చోళ సూట్ లో ప్రధాని మోడీ బస చేస్తారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ నుంచి చోళ సూట్ కు వెళ్లే మార్గంలో బిజెపి ఆధ్వర్యంలో రోడ్ షో ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్నారు. శనివారం ఉదయం 10. 10 గంటలకు ప్రధాని చోళ సూట్ నుంచి హెలికాప్టర్లో ఏయూ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తో కలిసి దాదాపు 15 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపడతారు.
ఏయూ గ్రౌండ్ నుంచి 11: 45 కు హెలికాప్టర్లో బయలుదేరి ఐ ఎన్ ఎస్ డేగ నుంచి 12. 05 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు బయలుదేరి వెళ్తారు. ప్రధాని సభకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 8500 మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందులో 18 మంది ఎస్పీలు, నలుగురు డిఐజిలు, గ్రే హాండ్స్ ఏపీఎస్పీ స్పెషల్ పార్టీ అక్టోపస్ విభాగాల నుంచి బందోబస్తుకు అధికారులు బాధ్యత నిర్వహిస్తున్నారు. ప్రధాని రోడ్ షోలో పాల్గొనున్న నేపథ్యంలో నిర్వాహకులు గుర్తించిన వ్యక్తులకి మాత్రమే రోడ్ షోలోకి అనుమతినిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం నుంచి విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. శనివారం ఉదయం 5: 30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు రావద్ద ని సూచిస్తున్నారు. ప్రధాని సభకు భద్రత కల్పించేందుకు బహిరంగ సభ పరిసరాల్లో 90 మెగా కెమెరాల ఏర్పాటు చేయగా ఏయూ మెరైన్ విభాగంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు.