పంజాబ్ లోని మోగాలోని లాలా లజపతిరాయ్ కాలేజీలో బీహార్, జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా ఈ గొడవ జరిగింది. దీంతో రెండు వర్గాలు రాళ్లు, ఇటుకలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ను అభినందిస్తూ కొంతమంది నినాదాలు చేయగా, కొంతమంది విద్యార్థులు ఇస్లాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని విద్యార్థులు తెలిపారు. దాని తర్వాత గొడవ జరిగిందన్నారు.
దీనిపై ఏఎస్ఐ జస్వీందర్ సింగ్ మాట్లాడుతూ రెండు గ్రూపుల విద్యార్థులు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారని, రాళ్లు రువ్వుకోవడం కనిపించిందని చెప్పారు. అయితే తన ముందు ఎవరూ నినాదాలు చేయలేదన్నారు. గాయపడిన ఓ విద్యార్థి మాట్లాడుతూ 'కొంతమంది భారత్ ను కించపరిచారు. మా వార్డెన్ దాని గురించి వారితో మాట్లాడటానికి వెళ్ళాడు. వారు అతనిపై దాడి చేశారు. మేము అతనిని రక్షించడానికి వెళ్ళాము' అని తెలిపాడు.