రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు గ్రామ సచివాలయం వద్ద సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు వెళ్లిన జనసేక కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారు. సోమవారం తొర్రేడు సచివాలయానికి జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం జనసేన అధ్యక్షుడు వై.శ్రీనివాస్, అర్బన్ నియోజకవర్గ ఇన్‌చార్జి అత్తి సత్యనారాయణ, కార్యక్తలు కలిసి టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీలకు సంబంధించి జరిగిన అవినీతిపై సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు సచివాలయానికి వెళ్లారు.ఈ క్రమంలో వైసీపీ నాయకులు కొందరు అడ్డుపడడంతో వాగ్వాదం జరిగింది. ఇది ఉద్రిక్త పరిస్ధితులకు దారితీసింది. వైసీపీ నాయకుల తీరును నిరసిస్తూ దుర్గేష్ ధర్నా చేశారు. శాంతియుతంగా సమాచారం కోసం సచివాలయానికి వెళితే అప్పటికే సచివాలయంలో ఉన్న వైసీపీ నాయకులు అడ్డుకుని భౌతిక దాడులకు దిగడాన్ని ఖండించారు. వై.శ్రీనివాస్ మాట్లాడుతూ సచివాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు గుండాల్లా దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో జామి సత్యనారాయణ, దాసరి గురునాథం తదితరులు పాల్గొన్నారు.