ట్విటర్‌ను సొంతం చేసుకున్న కొద్ది రోజుల్లోనే కఠినమైన మార్పులు చేపట్టిన ఎలాన్ మస్క్.. బ్లూటిక్‌కు ఛార్జీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా, యూకే సహా కొన్ని దేశాల్లో ఈ ఛార్జీలు అమల్లోకి రాగా.. తాజాగా భారత్‌లోనూ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. భారత్‌లో ఈ సబ్‌స్క్రిషన్‌కు నెలకు రూ.719 గా నిర్ణయించారట.
అయితే ప్రస్తుతానికి ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈ మెసేజ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అందరికీ ఈ ఛార్జీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ మెసేజ్‌లు వచ్చిన యూజర్లు కొందరు వాటిని స్క్రీన్‌షాట్లు తీసి ట్విటర్‌లో పోస్టు చేస్తున్నారు. అందులో నెలవారీ ఛార్జీ రూ.719గా కన్పించింది. బ్లూటిక్ కొనసాగించుకోవాలంటే ఖాతాదారులు ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వద్దనుకుంటే ఈ ఫీచర్‌ను రద్దు చేసుకోవచ్చు.
అయితే.. ట్విటర్ బ్లూ కోసం ఈ సబ్‌స్క్రిప్షన్ చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే బ్లూటిక్ వస్తుంది. దీంతో పాటు ఈ బ్లూటిక్ ఖాతాదారులకు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉండనున్నట్లు ఎలాన్ మస్క్ ఇప్పటికే వెల్లడించారు. అయితే ఇలా వెరిఫికేషన్ లేకుండా ఇవ్వడం వల్ల నకిలీ ఖాతాలు పెరిగే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొందరు ముఖ్య వ్యక్తులను గుర్తించేందుకు ‘అఫీషియల్’ గుర్తును ట్విటర్ తీసుకొచ్చింది. అయితే.. ఈ గుర్తు చాలా మంది ప్రభుత్వేతర వ్యక్తుల ఖాతాల్లోనూ కనిపించడంతో గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని గంటల్లోనే ‘అఫీషియల్’ గుర్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విటర్ ప్రకటించిన విషయం తెలిసిందే.