ప్రయాణికుల మనస్సును చూరగొనేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో ఇకపై రైళ్లలో ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని పొందవచ్చు. డయాబెటిస్ పేషంట్లు, చిన్నారులతో ఎక్కేవారు.. తమకు నచ్చినట్టుగా మెనూను పొందవచ్చు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రైళ్లలో ప్రాంతీయ వంటకాలు కూడా రుచి చూడవచ్చు. అంతేకాదు ముందుగా నోటిఫై చేసిన ధరల ప్రకారమే ప్రీపెయిడ్ రైళ్లలో మెనూను ఐఆర్‌సీటీసీని నిర్ణయిస్తుందని రైల్వే బోర్డు తాజా నోట్‌లో పేర్కొంది.
రైళ్లలో చిన్నారులతో సహా వివిధ వయస్సుల కలవారు తమకు నచ్చిన భోజనాన్ని చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే పండుగల వేళ ప్రత్యేక భోజనం లభించనుంది. చిరుధాన్యాలతో చేసే స్థానిక ఉత్పత్తులను మెనూలో భాగంగా చేసుకోవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కి రైల్వే బోర్డు పంపిన నోట్ ప్రకారం... రైళ్లలో కేటరింగ్ సేవలను మెరుగుపరచడం, ప్రయాణికులకు నచ్చిన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఇకపై రైళ్లలో ప్రాంతీయ వంటకాలు, ప్రత్యేక ఆహారాలు లభించనున్నాయి.
ఐఆర్‌సీటీసీ (ఐఆర్సీటీసీ) ప్రస్తుతం రైల్వే బోర్డు ఆమోదించిన మెనూనే కొనసాగిస్తోంది. రైల్వే బోర్డు సూచనతోనే మెనూలో మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్ల మెనూలో అలాగే ప్రీపెయిడ్ రైళ్లలో భోజనంలో భాగం కాకుండా ప్రత్యేకంగా ఆర్డర్ చేసే ఆహార పదార్థాలకు ఎంఆర్‌పీ ధరల్లో విక్రయించనున్నారు. దీంతో ఇక రైళ్లలో ప్రయాణించే వారికి తాము కావాల్సిన భోజనాన్ని పొందే అవకాశం ఏర్పడింది.